హైదరాబాద్, వెలుగు: విద్యార్థులకు ప్రతి విషయాన్ని ప్రశ్నించడం నేర్పాలని నీట్ రిటైర్డ్ ప్రొఫెసర్ రామచంద్రయ్య టీచర్లకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని యూటీఎఫ్ స్టేట్ ఆఫీసులో స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది ప్రాంతీయ శిక్షణా తరగతులు ఆదివారం రెండో రోజు కొనసాగాయి. శిక్షణా తరగతుల్లో శాస్త్రీయ ఆలోచన – టీచర్ల పాత్ర అనే అంశంపై ప్రొఫెసర్ రామచంద్రయ్య కీలకోపన్యాసం చేశారు. ప్రజలు ప్రశ్నించడాన్ని పాలకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అశాస్త్రీయ అంశాలను, సూడో సైన్స్‌ను సైంటిఫిక్ అంశాలుగా నమ్మించేందుకు పాలకవర్గాలు చూస్తున్నాయని చెప్పారు.
సిలబస్‌లో, చరిత్ర పాఠాల్లో, సైన్స్‌లో ఇష్టారీతిన మార్పులు చేస్తున్నారని, టీచర్లు ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని కోరారు. చరిత్రను.. వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా చెప్పడం వల్ల వర్తమానానికి, భవిష్యత్తుకు ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఇది అత్యంత ప్రమాదకరమని కేరళ ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు సి. రాధాకృష్ణన్ హెచ్చరించారు. ప్రజల వాడుకలో లేని సంస్కృత భాషను, వేద గణితాన్ని విద్యావ్యవస్థపై బలవంతంగా రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం విద్యను కేంద్రీకరిస్తూ ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తోందని, రాజ్యాంగ స్ఫూర్తికి, లౌకిక విలువలకు విరుద్ధంగా ఎన్‌ఈపీ 2020 ఉందన్నారు.
